సంస్కృతి మన శరీరం అయితే భాష మన ప్రాణం - ప్రముఖ శతావధాని, ప్రవచన కర్త తాతా సందీప్ శర్మ
సంస్కృతి మన శరీరం అయితే భాష మన ప్రాణం ఈ రెండు కలసిఉన్నప్పుడే పరస్పరం నిలబడతాయని ప్రముఖ ప్రవచనకర్త, శతావధాని తాతా సందీప్ శర్మ అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల యందు గిడుగు రామమూర్తి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకున్న తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థుల ఉద్దేశించి ఉపన్యాసించారు. వెయ్యేళ్లకు పైగా ఉన్న తెలుగు భాషలో ఎంతో గొప్ప సాహిత్యం వచ్చిందని, పద్యం నుండి వచనం, గేయం, కధ, నవల, నాని, హైకు వరకూ అనేక ప్రక్రియలలో తెలుగు కవిత్వం ఉందని, తెలుగులో ఎంతో సాహిత్యం ఉందని విద్యార్థులు అందరూ దానిని చదివి తెలుగు భాషలోని సౌందర్యాన్ని గ్రహించాలని చెప్పారు. తెలుగు భాషకే సొంతమైన ప్రత్యేకమైన ప్రక్రియ అవధాన ప్రక్రియ అని అయన తెలిపారు. గణితాన్ని, సైన్స్ ని, రెండింటినీ కూడా పద్యాలలో వ్రాసిన ఘనత మన తెలుగు కవులదేనని అయన తెలిపారు. పుస్తకాన్ని చదివితే అపారమైన జ్ఞానాన్ని సాధించవచ్చని అదే చరవాణి వినియోగిస్తే కాలాన్ని వృధా చేసుకోవడమేనని అందువల్ల ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు చెప్పారు. ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రక్రియలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, పోతన పద్యాలను విద్యార్థులందరూ ఆలపించిన తీరు, శ్రీ శ్రీ ఖండికలను ఆలపించిన విధానం చాలా బాగుందని, ఈ విద్యాసంస్థ తెలుగు భాషకు ఎంతగా ప్రాముఖ్యతనిస్తున్నారో తెలుసుకునేందుకు ఈరోజు జరుపుకున్న ఈ తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం నిదర్శనమని చెప్పారు. ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందానికి తన అభినందనలు తెలియజేశారు చక్కటి వాగ్దాటితో పద్యాలను మరియు ఖండికలను ఆలపించిన విద్యార్థులను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అదేవిధంగా సామెతలతో జరిపిన సంభాషణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన నృత్య రూపకం అందరిని ఎంతగానో ఆకట్టుకున్నది. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కథలు చెప్పుట, బాల గేయాలు, వ్యాసరచన, ఏకపాత్రాభినయం, సుమతి మరియు భాస్కర శతక పద్యాల పోటీలు, వక్తృత్వం, డిబేట్, రామాయణం పై క్విజ్ తదితర పోటీలను నిర్వహించారు. వాటిలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి సందీప్ శర్మ చేతుల మీద బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు KRJ శర్మ, విద్యా సంస్థల ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి