గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి 161 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకున్న తెలుగు భాషా దినోత్సవ వేడుకలు మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాహితీవేత్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త శ్రీ మహమ్మద్ అబ్దుల్ అజీజ్, తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు యాజ్ఞవల్క శర్మ, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల హెచ్ఆర్. డైరక్టర్ వి.వి.ఎస్.బి. బంగార్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి మాట్లాడుతూ విద్యార్థులందరూ తెలుగు భాష పట్ల అభిరుచి కలిగి ఉండాలని, పురాణ సాహిత్యాన్ని ప్రతి ఒక్కరు పఠించాలని, ఏ దేశమేగినా తెలుగు భాష పట్ల మమకారాన్ని కలిగి ఉండాలని తెలియజేశారు. పోతన పద్యాలను చదవడానికి ఇబ్బంది పడే ఈ రోజులలో విద్యార్థులు ఉన్నారని వారి దృక్పథం మార్చుకొని చక్కని పద్య సాహిత్యాన్ని చదవాలని తెలియజేశారు. గురజాడ అప్పారావు గారు అందరికీ ఆదర్శప్రాయులని ఆయనని ఆదర్శంగా తీసుకుని మనం కూడా సాహిత్యాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కృషి చేయాలని చెప్పారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీనాథ కవి సార్వభౌములు కుమార సంభవం కావ్యాల్లో మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి చాటారని అనంతరం శ్రీకృష్ణదేవరాయల వారు ఆ మాటను రుజువుపరిచారని కూడా తెలియజేశారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన బాల గేయాలు చిత్రలేఖనం చిత్రాల పరిశీలన రామాయణం పై క్విజ్ పద్య పఠనం తదితర పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు, జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి శ్రీనివాస్, ప్రధానోపాద్యాయిని అపర్ణ మరియు తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.