శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ శతావధాని, ప్రవచన కర్త డా|| తాతా సందీప్ శర్మ విచ్చేశారు. ముందుగా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించిన కార్యక్రమం లో 3 నుండి 5 వ తరగతి విద్యార్థులు పోతన భాగవత పద్యాలు కడు రమ్యంగా అందరికీ వినిపించగా, విద్యార్థులు చక్కని కూచిపూడి నృత్యంతో అందరినీ అలరించారు. హైస్కూల్ విద్యార్థులు శ్రీశ్రీ ఖండికలను ఆలపించగా, కొంతమంది విద్యార్థులు వాడుక భాషలో ఉన్న సామెతలను ఉపయోగించి చిన్ననాటిక ను ప్రదర్శించి తమ తోటి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథి తాతా సందీప్ శర్మ గారు తెలుగు భాషా ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరిస్తూ వెయ్యేళ్లకు పైగా ఉన్న తెలుగు భాషలో ఎంతో గొప్ప సాహిత్యం వచ్చిందని, పద్యం నుండి వచనం, గేయం, కధ, నవల, నాని, హైకు వరకూ అనేక ప్రక్రియలలో తెలుగు కవిత్వం ఉందని, తెలుగులో ఎంతో సాహిత్యం ఉందని విద్యార్థులు అందరూ దానిని చదివి తెలుగు భాషలోని సౌందర్యాన్ని గ్రహించాలని చెప్పారు. తెలుగు భాషకే సొంతమైన ప్రత్యేకమైన ప్రక్రియ అవధాన ప్రక్రియ అని అయన తెలిపారు. గణితాన్ని, సైన్స్ ని, రెండింటినీ కూడా పద్యాలలో వ్రాసిన ఘనత మన తెలుగు కవులదేనని అయన తెలిపారు. పుస్తకాన్ని చదివితే అపారమైన జ్ఞానాన్ని సాధించవచ్చని అదే చరవాణి వినియోగిస్తే కాలాన్ని వృధా చేసుకోవడమేనని అందువల్ల ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు చెప్పారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కథలు చెప్పుట, బాల గేయాలు, వ్యాసరచన, ఏకపాత్రాభినయం, సుమతి మరియు భాస్కర శతక పద్యాల పోటీలు, వక్తృత్వం, డిబేట్, రామాయణం పై క్విజ్ తదితర పోటీలను నిర్వహించారు. వాటిలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి సందీప్ శర్మ చేతుల మీద బహుమతులు ప్రధానం చేశారు.కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.