SynergyTuni SPVN Tuni 29 Aug 2026

శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
Share this article

శ్రీ ప్రకాష్ విద్యానికేతన్, తుని పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణకు విశేష కృషి చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ యువ అవధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 ప్రస్తుతం తిరుపతిలో సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో విద్యావారిధి (Ph.D.) అభ్యసిస్తున్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిభా అవార్డుతో పాటు ఢిల్లీ, తిరుపతి విశ్వవిద్యాలయాల నుంచి ఐదు స్వర్ణపతకాలను సాధించిన ప్రతిభావంతులు.

 ఇప్పటివరకు వివిధ ప్రముఖ క్షేత్రాల్లో 40 గీతావధానాలు, 27 సాహిత్య అష్టావధానాలు నిర్వహించి అవధాన రంగంలో విశిష్ట గుర్తింపు పొందారు. 

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, తెలుగు పద్యాలను చదవడం, మాతృభాషలో ముచ్చటించడం ద్వారా తెలుగు భాషపై అభిమానం, మమకారం మరింత పెంపొందుతాయని అన్నారు.
 మాతృభాషను మరచిపోకుండా, తెలుగు భాషను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

 మాతృభాషలో నేర్చుకున్న విషయాలు మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయని, జీవితాంతం వాటిని మరచిపోలేమని పేర్కొంటూ మాతృభాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష ఔన్నత్యం, గిడుగు రామమూర్తి పంతులు చేసిన అపార సేవలు, మాతృభాష పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 

విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

పద్య పఠనం, వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

 ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో అభిమానం, మమకారం, గౌరవభావం పెంపొందించేలా నిర్వహించిన ఈ వేడుకలు ఆద్యంతం అలరించాయి.

 మాతృభాష గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.